Srimad Valmiki Ramayanam

Balakanda

Chapter 4 ... Kusa Lava sing Ramayana !

With Sanskrit text in Devanagari , Telugu and Kannada

బాలకాండ
నాలుగవ సర్గ

ప్రాప్త రాజ్యస్య రామస్య వాల్మీకిర్భగవాన్ ఋషిః |
చకార చరితం కృత్స్నం విచిత్ర పద మాత్మవాన్ ||

తా|| భగవదానుగ్రహముతో పొందిన రామకథను మహర్షి అగు వాల్మీకి మహముని రాజ్యముపొందిన శ్రీరాముని చరిత్రను చిత్ర విచిత్రములగు పదములతో రచించెను.

చతుర్వింశత్ సహస్రాణి శ్లోకానామ్ ఉక్తవాన్ ఋషిః |
తథా సర్గశతాన్ పంచ షట్కాండాని తథోత్తరమ్||

తా|| ఇరువది నాలుగువేల శ్లోకములతో ఆరు కాండలలో ఇదువందల సర్గలతో, ఆ తరువాత ఉత్తరకాండతో మహాఋషి వాల్మీకి రామాయణమును చెప్పెను.

కృత్వా అపి తన్మహాప్రాజ్ఞః సభవిష్యం సహోత్తరమ్ |
చింతయామాస కోన్వేతత్ ప్రయుంజీయాదితి ప్రభుః ||

తా||భవిష్యత్తులో జరగబోవు కథను గూడ ఉత్తరకాండలో రచించి ఆ ప్రజ్ఞాశాలిఅగు మహాఋషి, ' ఈ చరితమును ఎవరు చెప్పగలరని ' ఆలోచనలో పడెను.

తస్య చింతయమానస్య మహర్షేః భావితాత్మనః |
అగృహ్ణీతాం తతః పాదౌ మునివేషౌ కుశీలవౌ ||

తా|| ఈ విధముగా చింతించుచున్న ఆ మహాముని పాదములను మునివేషములో నున్న లవ కుశులు పట్టుకోనిరి.

కుశీలవౌ తు ధర్మజ్ఞౌ రాజపుత్రౌ యశస్వినౌ |
భ్రాతరౌ సర్వ సంపన్నౌ దదర్శాశ్రమ వాసినౌ ||

తా|| ఆ కుశ లవులు ధర్మము తెలిసినవారు , రాజపుత్రులు , అన్నిగుణములతో ఉండి ప్రసిద్ధికెక్కినవారు ఆశ్రమ వాసులగు సోదరులని మహర్షి గాంచెను.

సతు మేధావినౌ దృష్ట్వా వేదేషు పరినిష్ఠితౌ |
వేదోప బృంహణార్థాయ తావగ్రాహయత ప్రభుః ||

తా|| ఆ వేదములను అధ్యనము చేసినవారులగు మేధావులిద్దరినీ చూచి వేదతుల్యమైన రామాయణము యొక్క వేదార్థమును ప్రసిద్ధి చేయుటకు వారే సమర్థులని వారిని స్వీకరించెను.

కావ్యం రామాయణమ్ కృత్స్నం సీతాయాశ్చరితం మహత్ |
పౌలస్త్యవథ మిత్యేవ చకార చరితవ్రతః ||

తా||ఈ కావ్యములో ముఖ్యముగా రాముని చర్రిత్ర , సీతా చరితము , పౌలస్త్యవధ ( రావణ వధ) చెప్పబడుట వలన దీనిని రామాయణము సీతాచరితము , పౌలస్త్యవధ అని చెప్పబడను.

పాఠ్యే గేయేచ మథురం పరమాణైస్త్రిభిరన్వితమ్ |
జాతిభిః సప్తభిర్బద్ధం తంత్రీలయ సమన్వితమ్ ||
రసైః శృంగార కారుణ్య హాస్య వీర భయానకైః |
రౌద్రాదిభిశ్చ సంయుక్తం కావ్యమేతదగాయతామ్ ||

తా|| ఈ రామాయణము పఠించుటకు , మధురముగా గానము చేయుటకు, మూడు కాల పరిమాణములకు అనుకరింపబడగలిగినది , సప్త స్వరములతో కూర్చబడినది, తంత్రీలయబద్ధమైనది . శృంగార, కారుణ్య , హాస్య , వీర , భయానక , రౌద్ర రసములతో కూడి యున్నది అగు ఈ రామాయణమును వారిద్దరూ గానముచేసిరి.

తౌ తు గాంధర్వ తత్వజ్ఞౌ మూర్చనాస్థానకోవిదౌ |
భ్రాతరౌ సర్వసంపన్నౌ గంధర్వావివ రూపిణౌ ||
రూపలక్షణ సంపన్నౌ మథురస్వరభాషిణౌ |
బింబాదివోద్దృతౌ బింబౌ రామదేహాత్ తథాపరౌ ||

తా|| ఆ ఇద్దరు సోదరులు గాంధర్వ విద్యలలో ఆరితేరినవారు, అన్ని స్థాయిలలో గానముచేయుటలో ఆరితేరినవారు , స్వరసంపదలు కలవారు , రూప సంపదలతో గంధర్వులవలెనున్న వారు, ఇంకా మధురమగు స్వరముతో భాషించుటలో చతురులు. ఆ ఇద్దరు సోదరులు రూపలక్షణ సంపదలతో గూడి రామునకు ప్రతిబింబము వలె వుండిరి.

తౌ రాజపుత్రౌ కార్త్స్న్యేన ధర్మం ఆఖ్యానముత్తమమ్ |
వచో విధేయం తత్సర్వం కృత్వా కావ్యమనిందితౌ ||
ఋషీణాం చ ద్విజాతీనాం సాధూనాం చ సమాగమే |
యథోపదేశం తత్వజ్ఞౌ జగతుస్తౌ సమాహితౌ ||

తా|| సకల ధర్మములను తెలుపునట్టి ఉత్తమమైన ఆకావ్యమును అ రాజకుమారులిద్దరూ కంఠస్థమొనర్చిరి . ఋషులూ , బ్రాహ్మణులూ సాధువుల సమాగమములో మిక్కిలి ప్రజ్ఞాశాలురు వేదముల తత్వజ్ఞానమును తెలిసినవారు అగు ఆ సోదరులిద్దరూ వారికి ఉపదేశించబడినటులనే గానము చేసితిరి.

మహాత్మనౌ మహభాగౌ సర్వలక్షణ లక్షితౌ |
తౌ కదాచిత్ సమేతానాం ఋషీణాం భావితాత్మనామ్ |
అసీనాం సమీపస్థౌ ఇదం కావ్యం అగాయతామ్ ||
తత్ శ్రుత్వా మునయస్సర్వే భాష్పపర్యాకులేక్షణః |
సాధు సాద్వీతి తావూచుః పరమ్ విశ్మయమాగతః ||

తా|| మిక్కిలి బుద్ధిశాలురు , సర్వశుభలక్షణములు కలవారు అగు ఆ సోదరులు ఒకసారి ఆశ్రమమునకు విచ్చేసిన స్ఠితపజ్ఞులైన సుఖాసీనులైన ఋషుల సమక్షములో అ కావ్యమును గానము చేసిరి . అది విని ఆ మునులందరూ అత్యంత ఆశ్చర్యముతో అనందాశ్రువులతో బాగు బాగు అని ప్రశంశించిరి.

తే ప్రీతమనసః సర్వే మునయో ధర్మవత్సలాః |
ప్రశశంసుః ప్రశస్తవ్యౌ గాయమానౌ కుశీలవౌ ||
అహో గీతస్య మాథుర్యం శ్లోకానాం తు విశేషతః |
చిరనిర్వృత్తం అస్యేతత్ ప్రత్యక్షమివ దర్శితమ్ ||

తా|| ధర్మబద్ధులైన ఆ మునులందరూ సంతోషపడిన మనస్సుగలవారై , ప్రశంశింప తగిన విధముగా గానముచేసిన కుశలవులను ప్రశంశించిరి. " అహో ఆ గీతములయొక్క మథురము , ఆ శ్లోకములయొక్క విశేషము ఎప్పుడో జరిగిన వృత్తాంతమును ప్రత్యక్షముగా కనపడునటుల చెప్పుచ్నున్నవి "

ప్రవిశ్య తావుభౌ సుష్ఠు భావం సమ్యగగాయతామ్ |
సహితౌ మథురం రక్తం సంపన్నం సర్వ సంపదా |
ఏవం ప్రశస్యమానౌ తౌ తపః శ్లాఘ్యేః మాహాత్మభిః |
సంరక్తతర మత్యర్థం మథురం తావగాయతామ్||

తా|| ఆ లవకుశులిద్దరూ భావములు వ్యక్తపడునటుల మధురముగా సప్తస్వరసంపదలతో రాగయుక్తముగా గానముచేసిరి. తపోధనులు మహత్ములు అయిన ఆ మునుల పారవశ్యమును గాంచి ఆ సోదరులిద్దరూ ఇంకనూ మధురముగా గానము చేయసాగిరి.

ప్రీతః కశ్చిమునిస్తాభ్యాం సంస్థితః కలశం దదౌ |
ప్రసన్నో వల్కలం కశ్చిద్దదౌ తాభ్యాం మహాయశాః ||
అన్యః కృష్ణాజినం ప్రాదాత్ మౌంజీమన్యో మహామునిః |
కశ్చిత్ కమండులం ప్రాదాత్ యజ్ఞసూత్రం తథాపరః ||

తా|| సంతోషపడిన మునులు కొందరు వారిద్దరికీ కలశములిచ్చిరి . కొందరు మునులు వస్త్రములను ఇచ్చిరి. కొందరు కూర్చునుటకు జింక చర్మమును, కొందరు దర్భతో చేసిన మొలతాడును , కొందరు కమండలము ,మరి కొందరు యజ్ఞోపవీతమును ఇచ్చిరి.

ఔదుంబరీం బ్రుసీమన్యో జపమాలాం అథాపరః |
బ్రుసీమన్యత్ తదా ప్రాదాత్ కౌపీనం అపరో మునిః ||
తాభ్యాం దదౌ తదాహ్రుష్టః కుఠారం అపరో మునిః |
కాషాయమపరో వస్త్రం చీరమన్యో దదౌ మునిః ||

తా|| కొందరు ఔదుంబరి వృక్షపు చెక్కతో చేయబడిన మేడిపీఠమును . కొందరు దానిపై మెత్తని ఆసనమును , కొందరు జపమాలను , కొందరు కౌపీనమును . అలాగే కొందరు మునులు ఒక గొడ్డలిని , కొందరు కాషాయ వస్త్రములను , మరి కొందరు ఉత్తరీయమును ఇచ్చిరి .

జటాబంధనమన్యస్తు కాష్ఠరజ్జుం ముదాన్వితః |
యజ్ఞభాండం ఋషిః కశ్చిత్ కాష్ఠభారం తథాపరః ||
ఆయుష్యమపరే ప్రాహుః ముదా తత్ర మహర్షయః |
దదుశ్చైవ వరాన్ సర్వే మునయః సత్యవాదినః ||

తా|| కొందరు జటాబంధనమును , కొందరు కాష్ఠరజ్జువును , కొందరు యజ్ఞపాత్రలను , కొందరు సమిథలను కానుకలుగా ఇచ్చిరి. పిమ్మట సభలో సంతోషపడిన సత్యవాదులైన ఆ మునులందరు ఆశీర్వచనములను వరములను ఒసగిరి.

ఆశ్చర్యమిదమాఖ్యానం మునినా సంప్రకీర్తితమ్ |
పరం కవీనామాథారం సమాప్తం చ యథాక్రమమ్ ||

తా|| ఆ మహర్షి చే రచించిబడిన ఈ మహకావ్యము మిక్కిలి ఆశ్చర్యము కొలుపునది. చివరివరకు యథాక్రమముగా చెప్పబడిన ఈకావ్యము కవులందరికీ ఆదర్శప్రాయము.

అభిగీతమిదం గీతం సర్వగీతేషు కోవిదౌ |
ఆయుష్యం పుష్ఠిజనకం సర్వశ్రుతిమనోహరమ్||

తా|| " ఓ గాన కోవిదులారా ! ఈ కావ్య గానము అత్యద్భుతముగా నున్నది. అయువును వృద్ధిచేయునది , పుష్ఠికరమైనది అందరూ వినతగినది. "

ప్రశస్యమానౌ సర్వత్ర కదాచిత్ తత్ర గాయకౌ|
రథ్యాసు రాజమార్గేషు దదర్శ భరతాగ్రజః ||

తా|| ఈ విధముగా ప్రశంశించబడిన ఆ గాయకులను వీధులయందు రాజమార్గములందు గానము చేయుచుండగా భరతాగ్రజుడగు రాముడు చూచెను

స్వవేశ్మచానీయ తదా భ్రాతరౌ చ కుశీలవౌ |
పూజయామాస పూజార్హౌ రామశ్శత్రునిబర్హణః ||

తా || ఆ సోదరులైన కుశలవులను తన భవనమునకు రప్పించి శతృవులను నాశనమొనర్చు ఆ రాముడు పూజకు అర్హులైన వారిని పూజింపసాగెను .

అసీనః కాంచనే దివ్యే స చ సింహాసనే ప్రభుః |
ఉపోవిష్ఠః సచ్వైః భ్రాతృభిశ్చ పరంతపః ||
దృష్ట్వాతు రూపసంపన్నౌ తావుభౌ నియత స్తదా |
ఉవాచ లక్ష్మణం రామః శతృఘ్నం భరతం తదా ||
శ్రూయతామిదమాఖ్యానం అనయోః దేవవర్చసోః |
విచిత్రార్థ పదం సమ్యక్ గాయకౌ తావచోదయత్ ||

తా|| శ్రీరాముడు దివ్యమైన బంగారు సింహాసనముపై కూర్చుని యుండెను. ఆరి ప్రక్కన మంత్రులు సోదరౌలు కూడా వుండిరి. అప్పుడు రూప సంపదలుగల ఆ ఇద్దరు సోదరులను చూచి శ్రీ రాముడు లక్ష్మణ భరత శతృఘ్నులతో ఇట్లనెను . ' ఈ దేవ వర్చస్సుగల ఈ బాలకులు గానముచేసెడి విచిత్రార్థ పదములుగల కథను వినుడు " అని పలికి ఆ గాయకులను ప్రొత్సహించెను.

తౌపి మథురం రక్తం స్వంచితాయత నిస్వనమ్ |
తంత్రీలయవదత్యర్థం విశ్రుతార్థ మగాయతామ్ ||
హ్లాదయత్ సర్వగాత్రాణి మనాంసి హృదయాని చ |
శ్రోత్రాశ్రయసుఖం గేయం తద్బభౌ జనసంపది ||

తా|| ఆ బాలకులు ఇద్దరూ మధురముగా రాగయుక్తముగా తంత్రీలయలతో కలిపి వినుటకు విందుగా గానము చేసిరి. ఆ జనసభలో వారు చేసిన గానము మనస్సులను ఆహ్లాదపరచెను , శరీరమంతయూ పులకింపజేసెను, వినువారికి వినుటకు సుఖమిచ్చెను.

ఇమౌ మునీ పార్థివలక్షణాన్వితౌ
కుశీలవౌ చైవ మహాతపస్వినౌ |
మమాపి తద్భూతికరం ప్రవక్ష్యతే
మహానుభావం చరితం నిబోధత ||

తా|| "ఈ బాలకులిద్దరూ మునివేషములోనున్ననూ రాజలక్షణములు గలవారు. వీరు గాయకులు . వీరు తపోధనులు. వీరి గానము నాకు కూడా శ్రేయస్కరమని చెప్పబడుచున్నది. కావున ఈ మహాచరితము వినుడు"

తతస్తు తౌ రామవచః ప్రచోదితౌ
అగాయతాం మార్గవిధాన సంపదా |
స చాపి రామః పరిషద్గతః శనైః
బుభూషయాసక్తమనా బభూవ హ ||

తా|| ఆ విధముగ రాముని వచనములతో ప్రోత్సాహితులై వారు మార్గవిధానములో గానము చేసిరి. శ్రీరాముడు కూడా మెల్లిగా ఆ జన పరిషద్ లో చేరి ఆ ఆనందము అనుభవించదలచినవాడై దానిలో లీనమాయెను.

ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే
వాల్మీకీయే బాలాకాండే
చతుర్థస్సర్గః
సమాప్తం||

మహర్షి వాల్మీకి రచించిన ఆదికావ్యమైన శ్రీమద్రామాయణములోని
బాలకాండలో నాలుగవ సర్గ
సమాప్తము.!!

|| ఓమ్ తత్ సత్ ||